T20: టీమిండియాకు వరుసగా రెండో విజయం
అదరగొట్టిన భారత యువ జట్టు.. యశస్వీ, ఇషాన్ కిషన్, రుతురాజ్ అర్ధ శతకాలు;
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 సిరీస్‌లో యువ భారత్ జోరు మాములుగా లేదు. వరుసగా రెండు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉంది. కంగారులతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు... రెండో టీ 20లోనూ ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోరు సాధించిన సూర్యకుమార్ యాదవ్ సేన.. అనంతరం కంగారులను కంగారు పెట్టి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. టపార్డర్ రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ చేసింది. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమతమయ్యారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 426 పరుగులు చేయడం విశేషం.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్వానించింది. టీమిండియా బ్యాటర్లు మరోసారి జూలు విదిల్చడంతో కంగారులపై భారత, జట్టు మరోసారి భారీ స్కోరు చేసింది. టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్.. యశస్వి జైస్వాల్... భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం ఆరు ఓవర్ లలో 77 పరుగులు జోడించి పవర్ ప్లేలోనే భారీ స్కోరుకు పునాది వేశారు. యశస్వి జైస్వాల్ కేవలం 25 బంతుల్లో 53 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ 9 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు బాదాదు. కేవలం 32 బంతుల్లో ఇషాన్ కిషన్ 3 ఫోర్లు, 4 సిక్సర్ లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి సూర్య అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 2 బంతుల్లో 7 పరుగులు చేసాడు. టాప్ ఆర్డర్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీం ఇండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆసిస్ బౌలర్లలో నాథన్ ఎలిస్ 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భారత బ్యాటర్ల ధాటికి సీన్ అబాట్ కేవలం 3 ఓవర్లలోనే 56 పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కళ్ల ముందు భారీ స్కోరు కనపడుతుండడంతో వేగంగా ఆడాలన్న ఒత్తిడిలో కంగారులు వరుసగా వికెట్లు కోల్పోయారు. రవి బిష్ణోయ్ ఆరంభంలోనే వికెట్లు తీసి కంగారులను కష్టాల్లోకి నెట్టేశాడు. భారత బౌలర్లు రాణించడంతో 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమతమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ కూడా 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.