TILAK VARMA: ఈ విజయం భారత జవాన్లకు అంకితం
హైదరాబాద్‌లో తిలక్ వర్మ సందడి.. లెగాల క్రికెట్ అకాడమీ సందర్శన.. చాలా ఒత్తిడిలో బ్యాటింగ్ చేశానన్న తిలక్.. పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వించారని వెల్లడి
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ విజయాన్ని భారత జవాన్లకు అంకితం ఇచ్చినట్లు టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ వెల్లడించాడు. మంగళవారం హైదరాబాద్‌లోని లింగంపల్లిలో తాను శిక్షణ పొందిన లెగాల క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మ సందడి చేశారు. లెగాల క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు. ‘‘ప్రతి మ్యాచ్‌లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశాం. అందరం సమష్టిగా కష్టపడ్డాం. చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్ చేశాను. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడాను’’ అని వివరించారు. మైదానంలో పాకిస్తాన్ ప్లేయర్లు అనేకసార్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తమకు చాలా కోపం వచ్చిందని తిలక్ వర్మ వెల్లడించాడు. కానీ కళ్ల ముందు దేశమే కనిపించిందని అందుకే చాలా ఓపిగ్గా ఆడామని తెలిపాడు. అప్పటికే మూడు కీలకమైన వికెట్లు కూడా పడ్డాయని.... దాంతో నా మీద మరింత బాధ్యత పెరిగింది అనిపించిందని తెలిపాడు. ఆ బాధ్యతను గుర్తెరిగి బ్యాటింగ్ చేశానని.. విజయం సాధించాలన్న కసితో ముందుకు సాగానని వెల్లడించాడు.
కసిగా ఆడాం
ఆసియా కప్ ఫైనల్లో చాలా కసిగా ఆడామని.. కసిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించామని తిలక్ వర్మ తెలిపాడు. అందరం సమిష్టిగా రాణించామని తిలక్ వర్మ అన్నాడు. ఈ మ్యాచ్ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. విజయంలో తల్లిదండ్రులు, కోచ్‌దే కీలక పాత్ర అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు.
తిలక్ వర్మకు ఘన స్వాగతం
ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మకు.. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి తిలక్‌ను కలిసి అభినందనలు తెలిపారు. “ఆపరేషన్ తిలక్ వర్మ”.. అని దేశమంతా అంటుండటం చాలా గర్వంగా ఉందని ఈ టీమిండియా స్టార్ తెలిపాడు. ఆసియా కప్ ఫైనల్లోని ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని, జట్టు కోసం కష్టపడ్డందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో కూడా తెలియడం లేదని తెలిపారు. టోర్నీలో జట్టు సమష్టిగా కష్టపడ్డిందని, చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగిందని కూడా పేర్కొన్నారు. ఓటమి తీరాలుగా వెళ్తున్న మ్యాచ్‌లో తానే గెలుపు బాటలు వేశానని తెలిపారు. వ్యూహాల మార్పులు, ప్రతి మ్యాచ్‌లో జట్టు కృషి విజయానికి కారణమని తిలక్ పేర్కొన్నాడు. ఫైనల్లో తిలక్ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.