U19 WORLD CUP: నేడే ప్రపంచకప్‌ ఫైనల్‌

రెండో అండర్ 19 ప్రపంచకప్‌పై భారత్ కన్ను... దక్షిణాఫ్రికాతో తుది పోరు;

Update: 2025-02-02 01:30 GMT

ప్రతిష్ఠాత్మక అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు... తుది పోరుకు సిద్ధమయ్యారు. ఈ మెగా టోర్నీలో అప్రతిహాత విజయాలతో ఫైనల్ చేరిన యువ భారత జట్టు.. దక్షిణాఫ్రికాతో ఫైనల్ సమారానికి సిద్ధమయ్యారు. టైటిల్‌ పోరులో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడని భారత్ ఫైనల్‌లోనూ సౌతాఫ్రికాపై అదే జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. అటు సౌతాఫ్రికా కూడా ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా పొందలేదు. దీంతో ఆ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. చూడాలి మరి ఓ జట్టు టైటిల్ సాధిస్తుందో.

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్..

ఈ మెగా టోర్నీలో యువ టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా పైనల్ చేరింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు న్యాయం చేస్తూ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. పరుణిక, వైష్ణవి స్పిన్‌ తంత్రంతో ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. లక్ష్యఛేదనలో తెలంగాణ స్టార్‌ త్రిషతో పాటు కమలిని జోరు కనబర్చడంతో భారత్‌ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టైటిలో పోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొట్టమొదటి అండర్‌–19 టి20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు జగజ్జేతగా అవతరించింది. రెండేళ్ల తర్వాత అదే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునేందుకు ఈసారి దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఫైనల్‌ సంగ్రామానికి సిద్ధమైంది.

పటిష్టంగా టీమిండియా

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ వనరులతో పూర్తిస్థాయి ఆల్‌రౌండ్‌ సామర్థ్యంతో ఉన్న టీనేజ్‌ టీమిండియాను ఎదుర్కోవడం ఏ జట్టుకు అయినా అతిపెద్ద సవాల్‌గా మారనుంది. అలాంటి అబేధ్యమైన జట్టును ఓడించాలంటే మాత్రం దక్షిణాఫ్రికా మైదానంలో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించకతప్పదు. భారత బౌలింగ్‌ విభాగానికొస్తే ఆయుశి శుక్లా, పారుణిక సిసోడియా, వైష్ణవి శర్మలతో కూడిన స్పిన్‌ త్రయం విశేషంగా రాణిస్తోంది. సహజంగానే సఫారీలకు స్పిన్‌ అంటేనే కష్టం. అలాంటి జట్టుపై ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు స్పిన్నర్లు తప్పకుండా ప్రభావం చూపిస్తారు. బ్యాటింగ్‌లో తెలంగాణ స్టార్‌ బ్యాటర్‌ గొంగడి త్రిష భీకర ఫామ్‌లో ఉంది. ఫైనల్లో మరోసారి సత్తా చాటితే త్రిషను ఆపడం ప్రొటీస్‌కు చాలా కష్టమే. తన అసాధారణ బ్యాటింగ్‌తో త్రిష అద్భుతాలు సృష్టిస్తోంది. మరో ఓపెనర్‌ కమలిని, సనిక చాల్కెలతో కూడిన భారత బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా విజయంపై ఆశలు పెంచుకోవాలంటే మాత్రం ముఖ్యంగా త్రిష, కమలినిలను తక్కువ స్కోరుకు పరిమితం చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో త్రిష 265 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉండగా... కమలిని 135 పరుగులతో మూడో స్థానంలో ఉంది.

Tags:    

Similar News