India vs West Indies: మెరిసిన కోహ్లీ, రోహిత్..భారీ స్కోరు దిశగా భారత్
రెండో టెస్ట్‌లో భారీ స్కోరు దిశగా భారత్... క్రీజులో కోహ్లీ, రవీంద్ర జడేజా...;
వెస్టిండీస్( West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్(India) భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు( India scored 288) చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohit Sharma ), యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) శుభారంభం అందించారు. రోహిత్(Skipper Rohit Sharma) ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడినా.. జైస్వాల్ మాత్రం మొదటి నుంచీ దూకుడు ప్రదర్శించాడు. ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేసిన ఓపెనర్లపై తొలి సెషన్లో విండీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
జైస్వాల్ వన్డే తరహాలో ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 49 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో భారత్ 121/0తో నిలిచి పటిష్టస్థితిలో లంచ్‌కు వెళ్లింది. భోజన విరామం తర్వాత విండీస్ బౌలర్లు పుంజుకున్నారు. లంచ్ తర్వాత విండీస్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ గాడితప్పింది. 57 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ను జేసన్ హోల్డర్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్.. కీమర్ రోచ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సెంచరీ దిశగా సాగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను 80 పరుగుల వద్ద స్పిన్నర్ వారికన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. రహానెను 8 పరుగుల వద్ద గాబ్రియల్ వెనక్కి పంపాడు. దీంతో టీ విరామ సమయానికి 182/4తో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో సెషన్‌లో భారత్ 61 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.
నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆదుకున్నారు. విరాట్ కోహ్లీ(Virat Kohli) 161 బంతుల్లో 87 నాటౌట్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 84 బంతుల్లో 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లీ నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. కీమర్ రోచ్ వేసిన 60వ ఓవర్‌లో మొదటి రెండు బంతులను విరాట్ కోహ్లీ బౌండరీ దాటించాడు. ఇదే ఓవర్లో జడేజా కూడా ఓ ఫోర్ బాదాడు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, గాబ్రియల్, వారికన్, జేసన్ హోల్డర్ తలో వికెట్ పడగొట్టారు.