ఒకప్పుడు క్రికెట్‌కు పర్యాయపదం వెస్టిండీస్. భీకరమైన బౌలింగ్, ధాటిగా ఆడే బ్యాటర్లు, కళ్లు చెదిరే ఫీల్డర్లు..ఇలా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్ఠమైన టీంగా గా విండీస్ పేరు.1975, 1979 వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచిన టీం.. 1983లో రన్నరప్‌గా నిలిచింది. అలా ఒకప్పుడు ప్రత్యర్థులను గజగజా వణికించిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు కనీసం వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.జింబాబ్వేలో జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ దశలో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్.. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఘోరంగా విఫలమైంది .ఈ నేపధ్యంలో వరల్డ్ కప్ హిస్టరీలోనే తొలిసారిగా వెస్టిండీస్ లేకుండా టోర్నమెంట్ జరగనుంది. 48 ఏళ్ల క్రితం క్రికెట్ చరిత్రలో తొలి ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్.. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడడం లేదు.దీంతో ప్రపంచకప్‌కు చేరుకోకముందే తన ప్రయాణాన్ని ముగించింది.
ఇక గతమెంతో ఘనమన్నట్లుగా..నానాటికీ తీసికట్టుగా మారిన ఆటతో ఇప్పటికే అవమానాలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్.. ఇప్పుడు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఒకప్పుడు అరివీర భయంకరమైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరీబియన్ జట్టుకు ఇలాంటి దుస్థితి రావడం ముందుతరం క్రికెట్ అభిమానులకు పెద్ద షాకే అంటున్నారు క్రికెట్ లవర్స్.
మరోవైపు ఇప్పుడే క్రికెట్లో ఓనమాలు దిద్దుతున్నట్లు..అంతర్జాతీయ అనుభవమే లేదన్నట్లు జింబాబ్వే, ఆ తర్వాత నెదర్లాండ్స్ చేతుల్లో ఓటమిపాలైన వెస్టిండీస్‌కు ప్రపంచకప్ అవకాశాలు అప్పటికే పతనమయ్యాయి. అయితే స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధిస్తే వరల్డ్ కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాలను చేతులారా చేజార్చుకుంది కరేబియన్ జట్టు. మొదట బౌలింగ్ చేసిన స్కాట్లాండ్ వెస్టిండీస్‌ను ఆదిలోనే చిత్తు చేసింది.
టోర్నమెంట్‌లో పటిష్టంగా రాణిస్తున్న ఆల్ రౌండర్ బ్రాండన్ మెక్‌ముల్లన్ తన తొలి మూడు ఓవర్లలోనే వెస్టిండీస్‌లోని టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో కేవలం 30 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత కెప్టెన్ హోప్, నికోలస్ పూరన్ కూడా త్వరగానే ఔటయ్యారు. 21వ ఓవర్‌కు వెస్టిండీస్ స్కోరు 81 పరుగులు మాత్రమే కాగా అప్పటికే 6 వికెట్లు పడిపోయాయి. అయితే జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ జట్టును ఆదుకున్నారు.అయితే ఇద్దరు బ్యాటర్లు వరుసగా రెండు ఓవర్లలో ఔట్ కావడంతో జట్టు మొత్తం 181 పరుగులకే కుప్పకూలింది.