YEAR END: భారత క్రికెట్ చరిత్రలో గోల్డెన్ ఇయర్
2025లో భారత్ సం చలన విజయాలు... ప్రపంచకప్, ఐసీసీ ట్రోపీల్లో సత్తా.. భారత క్రికెట్ చరిత్రలో గోల్డెన్ ఇయర్
2025 ఏడాది భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. అటు పురుషులు, ఇటు మహిళలు ప్రపంచ క్రికెట్‌లో చెలరేగిపోయారు. గతంలోని ఓటమి గాయాలను ఈ ఏడాది అద్భుతమైన విజయాలతో నయం చేసుకున్నారు. ముఖ్యంగా వైట్‌బాల్ (వన్డే, టీ20) క్రికెట్‌లో పురుషులు, మహిళల జట్లు తమ ఆధిపత్యాన్ని చలాయించాయి. రెడ్‌బాల్ (టెస్ట్) క్రికెట్‌లో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా, వన్డేలు, టీ20ల్లో మాత్రం భారత జట్లు అసాధారణ విజయాలను సాధించాయి. ముఖ్యంగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రెండు ప్రధాన వైట్‌బాల్ టోర్నమెంట్లను గెలిచి భారత్ సత్తాను ప్రపంచ క్రికెట్‌కు చాటింది. మహిళల వన్డే వరల్డ్‌కప్ విజయం, అంధుల క్రికెట్‌లో ప్రపంచ కిరీటం వంటి చారిత్రక ఘట్టాలతో 2025 భారత్‌కు చిరస్మరణీయ సంవత్సరంగా నిలిచింది. 2026 ఏడాదికి దగ్గరవుతున్న వేళ, ఈ ఏడాది భారత క్రికెటర్లు సాధించిన చారిత్రాత్మక విజయాలను ఓసారి నెమరేసుకుందాం.
2005లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓటమి, 2017లో ఇంగ్లాండ్ గడ్డపై కేవలం 9 పరుగుల తేడాతో త్రుటిలో చేజారిన ప్రపంచకప్, 2020 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ విషాదం… ఇలా భారత మహిళా క్రికెట్ చరిత్రలో ‘ఫైనల్’ అంటేనే తెలియని భయం, బెరుకు. ‘భారత అమ్మాయిలు ఫైనల్ వరకు వస్తారు కానీ గెలవలేరు’ అన్న విమర్శలు ఎన్నో. కానీ ఈ ఏడాది నవంబర్ 2న రాత్రి నవీ ముంబయి సాక్షిగా ఆ అనుమానాలను పటాపంచలు చేశారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకుంది. 2002 (శ్రీలంకతో సంయుక్తంగా), 2013లో ట్రోఫీ గెలిచిన భారత్, ఈ విజయంతో టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడం ఈ విజయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుబాయ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఈ ఏడాది భారత అమ్మాయిలు సాధించిన మరో గొప్ప విజయం మహిళల అంధుల టీ20 వరల్డ్‌కప్. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఫైనల్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి తొలి మహిళల అంధుల టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్‌ను భారత్ 114/5 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం కేవలం 12 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్ విజయం తర్వాత కొన్ని వారాలకే ఈ విజయం వరించింది. ఈ గెలుపు దివ్యాంగ క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహమనే చెప్పాలి.
సెప్టెంబరులో భారత పురుషుల జట్టు ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదోసారి టైటిల్‌ను ముద్దాడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా భారత్ విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించడం గమనార్హం.