Hyderabad Crime : ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నాడని.. ప్రియురాలి తండ్రిపై కాల్పులు

అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎయిర్ గన్, ఎయిర్ పిస్టల్ స్వాధీనం;

Update: 2024-11-11 03:15 GMT

ప్రేమించిన అమ్మాయిని తనకు కాకుండా చేశాడన్న కోపంతో ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడో యువకుడు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక వెంకటేశ్వరకాలనీకి చెందిన వ్యాపారి (57)కి ఇద్దరు కుమార్తెలు. ఆయన చిన్నకుమార్తె, అంబర్‌పేటకు చెందిన గోగికార్ బల్వీర్ (25) ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం ఇద్దరూ ఒకే కళాశాలలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానంటూ బల్వీర్ ఆమెను వేధించేవాడు.

విషయం యువతి తండ్రికి తెలియడంతో బల్వీర్‌ను హెచ్చరించాడు. దీంతో కక్షగట్టిన బల్వీర్ ఆయనను చంపేస్తానంటూ స్నేహితులతో తరచూ చెప్పేవాడు. ఇటీవల ఆమె ఇంటికి వెళ్లి యువతి తండ్రిని హెచ్చరించాడు. దీంతో ఆయన తన కుమార్తెను విదేశాలకు పంపించారు. విషయం తెలిసిన బల్వీర్ యువతిని తనకు కాకుండా చేసినందుకు కోపంతో ఊగిపోయాడు.

నిన్న యువతి ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న ఎయిర్ పిస్టల్‌తో యువతి తండ్రిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడికంటికి తీవ్ర గాయమైంది. కాల్పుల అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేసి బైక్‌పై పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశాడు. అతడి నుంచి ఎయిర్‌గన్, ఎయిర్ పిస్టల్, పెల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన యువతి తండ్రి కోలుకుంటున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News