Huzurabad by-election: హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు
Huzurabad by-election: తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎంతమంది పోటీపడేది తేలిపోయింది.;
Huzurabad by-election: తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎంతమంది పోటీపడేది తేలిపోయింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 30 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తం 61మంది నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్ల పరిశీలన తర్వాత 42 మంది అభ్యర్తులు నిలిచారు.
నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజైన బుధవారం ఈటల జమున, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డితో పాటు మరో పది మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత 30 మంది అభ్యర్థులు మిగిలినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
హుజూరాబాద్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో దిగారు. అభ్యర్థుల ఆధారంగా ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 15మంది అభ్యర్థులు, ఒక నోటా కలిపి 16మందికి అవకాశం ఉండనుంది.
దీంతో హుజూరాబాద్ లో ఈసారి రెండు ఈవీఎంలు అవసరమవుతాయి. ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు, నెంబర్లతో అక్షరక్రమంలో గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. నవంబరు 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఈటల బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తులు ఒడ్డుతున్న అధికార పక్షం టీఆర్‌ఎస్... గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నేతలు గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపింది. దసరా తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించడానికి కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నారు.