ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్)కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్ ప్రారంభ తేదీ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం 3వ తేదీకి వాయిదా పడింది. వచ్చే నెల 2వ తేదీ వరకు ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించిందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. 3న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని చెప్పారు. దాదాపు 45 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 1938లో నిజాం కాలంలో మొదలయిన నుమాయిష్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్‌లను అందుబాటులో ఉంచింది. సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు.. సందర్శకులు మైదానంలో తిరిగేందుకు రోడ్లను ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. 46 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.