పైసల కోసం కన్నకొడుకునే కిడ్నాప్..
సొంత కొడుకునే కిడ్నాప్ చేశాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే బిడ్డను చంపేస్తానని బెదిరిచాడు.;
సొంత కొడుకునే కిడ్నాప్ చేశాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే బిడ్డను చంపేస్తానని బెదిరిచాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని చెరువుకొమ్ముపాలెంకు చెందిన రామకృష్ణారెడ్డి.. డబ్బుల కోసం చేసిన ఈ నీచమైన పని కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని షాక్‌కి గురి చేసింది. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి ఏడాదిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఊళ్లోనే ఉంటున్నాడు. మద్యం, పేకాట లాంటి చెడు వ్యసనాలకు బాగా బానిసయ్యాడు.
దాదాపు 20 లక్షల వరకూ అప్పులు చేశాడు. అవి తీర్చడానికి అమ్మానాన్నల్ని, అత్తామామల్ని డబ్బులు అడిగాడు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో కొడుకును కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయాడు. కందుకూరులోని ఓ లాడ్జిలో దిగాడు. 20 లక్షలు ఇవ్వకపోతే బాబును చంపేస్తానంటూ భార్యకు ఫోన్ చేశాడు. ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. చివరికి టెక్నాలజీ సాయంతో రామకృష్ణారెడ్డి ఉన్న లాడ్జ్‌ను గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాబును క్షేమంగా తల్లికి అప్పగించారు.