ACB Raids : ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

Update: 2024-08-13 09:45 GMT

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేపట్టారు. హాస్టళ్లలో ఆహారం సహా సౌకర్యాలు తదితర విషయాలపై ఆకస్మిక సోదాలు చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ప్రయోజనాల తీరును పరిశీలిస్తున్నారు.

కొంత కాలంగా ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుల మేరకు దాడులు చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుల్లిన పదార్థాలతో ఆహారం వండుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ప్రభుత్వ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. గురుకులాలు, హాస్టళ్లలో సోదాలు చేస్తున్న ఏసీబీ. మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్ లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులన్నింటిని క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. పలు హాస్టల్ స్టూడెంట్స్ రిజిస్టర్ లలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్టు వార్డెన్ లు నమోదు చేశారు. ఎక్కువ మంది ఉన్నట్టు చూపి అధిక మెస్ బిల్లులు తీసుకుంటున్నట్టు చేస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తిసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News