ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ధరణిలో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు ఓ రైతు నుంచి వాళ్లు రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు.
ధరణి వెబ్‌సైట్‌లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు రూ. 8 లక్షలను సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి సీనియర్ అసిస్టెంట్ చెప్పారు.
ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్‌కు సీనియర్ అసిస్టెంట్ ఫోన్ చేశాడు. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. రంగంలోకి దిగి భూపాల్ రెడ్డితో పాటు, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్‌ను ఏసీబీ అధికారలు అరెస్ట్ చేశారు.