ADMISSIONS: సాందీపని గురుకులంలో ప్రవేశాలకు నోటిఫికేషన్
వేదవిద్య నుంచి AI వరకు విద్యా బోధన
తెలంగాణలోని సాందీపని గురుకులం 2026–27 విద్యాసంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ ప్రాచీన విద్యా విధానాలతో పాటు ఆధునిక విద్యా పద్ధతుల సమ్మేళనంగా విద్యను అందిస్తున్న ఈ గురుకులం, భారత ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS)తో అనుబంధంగా పనిచేస్తోంది.వికారాబాద్ జిల్లా తాండూరు మండలం... జింగుర్తి గ్రామంలో ఉన్న ఈ గురుకులంలో 12 సంవత్సరాల సంపూర్ణ గురుకుల విద్య అందించనున్నారు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, పరిశీలన అనంతరం విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాందీపని గురుకులంలో విద్యార్థులకు వేదవిద్య, వేదిక్ మ్యాథ్స్‌తో పాటు గుర్రపుస్వారీ, త్రినేత్ర విద్య, మల్లఖంబ విద్య, విలువిద్య, సంగీతం, చిత్రలేఖనం వంటి సంప్రదాయ కళలు బోధించనున్నారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్ సైన్స్ వంటి ఆధునిక విద్యా అంశాలను కూడా బోధించనున్నారు.
ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యం
విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. మొత్తం 12 సంవత్సరాల గురుకుల విద్య అనంతరం విద్యార్థులు ఉద్యోగాలు వెతుక్కునే స్థాయికి మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి సృష్టించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా ఈ విద్యా విధానం రూపొందించబడింది.ప్రతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం భాషల్లో ప్రావీణ్యం కలిగించేలా బోధన ఉంటుంది. అలాగే వినూత్న ఆలోచనలకు, వృత్తి నైపుణ్య శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
తల్లిదండ్రులకు నిబంధనలు
ఒక కుటుంబం నుంచి ఒక్క విద్యార్థికే ప్రవేశం ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం రూ.25,000 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల విద్య పూర్తయిన అనంతరం ఈ మొత్తం తిరిగి చెల్లించనున్నారు. పరీక్ష సమయంలో రూ.500 పరీక్ష ఫీజు వసూలు చేస్తారు. పుస్తకాలు, యూనిఫామ్ తదితర అవసరాలను తల్లిదండ్రులే సమకూర్చాల్సి ఉంటుంది. వివరాలకు 9154795530 నంబర్‌ను సంప్రదించాలని గురుకులం యాజమాన్యం తెలిపింది.