CASE: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై మరో కేసు!
2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులోనూ రాహిల్ పేరు... కేసు తిరగదోడుతున్న పోలీసులు;
బోధన్ మాజీ MLA షకీల్ కుమారుడు రాహిల్ మెడకు మరో కేసు చుట్టుకోనుంది. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో పరారీలో ఉన్న రాహిల్‌పై పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితులకు సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై చర్యలు సైతం తీసుకున్నారు. తాజాగా 2022లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలోనూ అతని ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదోడుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో 2022న మార్చి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు తిరిగి ప్రారంభించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహింద్రా థార్ వాహనం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. ముగ్గురు మహిళలకు గాయాలు కాగా.. రెండు నెలల బాలుడు దుర్మరణం చెందాడు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ... వాహనంపై MLA స్టిక్కర్ ఉండటంతో షకీల్ వాహనంగా తేలింది. అయితే అందులో తన కుమారుడు లేడని షకీల్ ప్రకటన ఇచ్చారు. మరోవైపు అఫ్రాన్ అనే మరో యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి లొంగిపోయాడు. స్టీరింగ్‌పై వేలిముద్రలు అఫ్రాన్‌వేనని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. బాధితుల వాంగ్మూలాల సేకరణ సహా, CCTV దృశ్యాల ఆధారంగా మాజ్ అనే మరో యువకుడితో పాటు కారులో రాహిల్ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. ఇటీవలే CM క్యాంపు కార్యాలయం వద్ద రాహిల్ చేసిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పాత కేసుపై DCP విజయ్ కుమార్ దృష్టి సారించారు. అప్పట్లో 304-B సెక్షన్ చేర్చకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఆరా తీయకపోవడం లాంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన బాధితుల వాంగ్మూలం ఆధారంగా రాహిల్ డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. అతన్ని తప్పించే ప్రయత్నంలో ఒకరిద్దరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ప్రజా భవన్ వద్ద రోడ్డు ప్రమాద కేసులో నిందితులకు సహకరించినందుకు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాజా దర్యాప్తులో మరేవరైనా అధికారులు తేలే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.