ATTACK: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
దాడి చేసిన జాగృతి కార్యకర్తలు... గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్... 5 రౌండ్లు కాల్పులు జరిగిన గన్‌మెన్;
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు.. జాగృతి కార్యకర్తల దాడిలో మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం అయింది. మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపిస్తున్నారు. అయితే.. జాగృతి నేతల దాడి సమయంలో మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు. క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
జాగృతి సభ్యుడికి గాయాలు
ఈ కాల్పుల్లో జాగృతి సభ్యుడు సాయి అనే యువకుడికి గాయాలయ్యాయి. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన చేతి నుంచి బులెట్ వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఎక్కువగా రక్తం మరకలు కనిపించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం బీసీ వాదాన్ని ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కవిత చర్యలను తప్పుబడుతూ తీన్మార్ మల్లన్న యూట్యూబ్ లైవ్ షోలో వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలే జాగృతి కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఈ దాడి బీఆర్ఎస్ మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలచే జరిగిందని తీన్మార్ మల్లన్న మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇకనుంచి తేల్చుకుందాం కవితపై మల్లన్న ఫైర్
కేసీఆర్, కేటీఆర్ మీద ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే వారితో తేల్చుకోవాలని.. కానీ తనపై హత్యాయత్నం చేయడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఆమెకు సంబంధించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ‘నాపై దాడులు చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే అది మీ భ్రమే. నాపై హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు తీన్మార్ మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే. కవిత అనుచరుల దాడిలో నా చేతికి గాయమైంది. దాడులను గమనించిన మా గన్‌మెన్ అప్రమత్తం అయ్యారు. కానీ ఆ గూండాలు గన్ మెన్ వద్ద నున్న తుపాకీ లాక్కొని మరీ మా ఆఫీసులో బీభత్సం చేశారు. మా సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నీచర్, ఆఫీసులో అద్దాలు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడుల్లో నాతో పాటు కొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయని మల్లన్న తెలిపారు. "ఇలాంటి ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులపై, న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నాం. “ అన్ని మల్లన్న అన్నారు. ఈ దాడుల వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.