రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. వేములవాడ రాజన్నను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు శాపం కావద్దని రాజన్నను మొక్కుకున్నానని.. జ్ఞానోదయం చేయాలని వేడుకున్నానని చెప్పారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టు వేసి మాట తప్పారన్నారు. పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుంది, ప్రజలకు శాపమవుతుందని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు.. సంజయ్ రైతు యాత్రలోనూ హరీశ్ పాల్గొన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఈ యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్..మళ్లీ డిసెంబర్ వచ్చినా పూర్తి రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ..కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. పాదయాత్రలో బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.