Badi Bata: 3 నుంచి 19 వరకు బడిబాట
అర్హత ఉన్న అంగన్‌వాడి పిల్లలను సమీపంలోఉన్న ప్రాథమిక బడిలో చేర్చటమే లక్ష్యం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో.. మరో రెండు వారాల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 3న బడిబాట కార్యక్రమం ప్రారంభంకానుంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు చిన్నారుల తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను తెలియజేయనున్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసం, బాలికా విద్య ప్రాముఖ్యత తెలియజేస్తూ చదువుకు దూరమైన పిల్లలను పాఠాశాలలకు తీసుకురావటమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని తలపెట్టారు.
చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే ప్రథమ ఎజెండాగా రూపొందిన బడిబాడ కార్యక్రమం జూన్ 3న ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయనున్నారు. బడి ఈడు ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కార్యక్రమంలో బడి వయసు పిల్లలను గుర్తించి దగ్గర్లోని పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు నిర్ణయించింది. ఇందులో కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పేర్కొంది.
ఇందులో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రోజూ ఉదయం ఉదయం 7నుంచి 11 గంటల వరకు విద్యార్థుల నమోదు చేపట్టనున్నారు. గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల నమోదుపై చర్చించనున్నారు. 4న ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల్లో విద్యకు దూరమైన వారిని గుర్తించి వారి పేర్లను పాఠశాలల్లో నమోదు చేయనున్నారు. ఇక 5 నుంచి 10 వరకు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల నమోదుతోపాటు... అంగన్వాడీల్లో పిల్లలను గుర్తించి వారిని ప్రాథమిక పాఠశాలల్లో నమోదు చేయనున్నారు. 11న గ్రామ సభ నిర్వహించి బడిబాట లక్ష్యాలపై చర్చిస్తారు. 12న పాఠశాలల పునఃప్రారంభంతో పాఠశాలలను ఆలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 13న ఫౌండేషన్, న్యూమరసీ డేలు నిర్వహించి 14 స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టనున్నారు. 15న బాలికా విద్యా దినోత్సవంలో భాగంగా వారిని విద్యావంతులను చేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. 18న క్లాస్ రూమ్ డిజిటలైజేషన్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంతో పాటు మొక్కలు నాటిస్తారు. ఆ తరువాత 19 న చేపట్టే క్రీడా దినోత్సవంతో బడిబాట కార్యక్రమానికి ముగింపు పలకనున్నారు.