జనగామ సీఐ మల్లేష్‌పై బండి సంజయ్ ఆగ్రహం
బీజేపీ నేతలపై దాడి చేసిన సీఐ మల్లేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.;
జనగామ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వివేకానందుని జయంతి సందర్భంగా తమ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ ఆఫీస్‌లో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. కమిషనర్.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలపై లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో జనగామ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పపన్ శర్మకు గాయాలయ్యాయి.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. జనగామ సీఐ మల్లేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు సమన్యాయం పాటించేవారే అయితే... TRS పార్టీ ఫ్లెక్సీలు ఉంచి.. BJP ఫ్లెక్సీలు చించిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వామి వివేకానంద ఉత్సవాలు జరపడంపై నిషేధం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై దాడి చేసిన సీఐ మల్లేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.