Bandi Sanjay: బండి సంజయ్ దూకుడు వెనుకున్నది ఎవరు?
Bandi Sanjay: తెలంగాణలో పట్టుబిగించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.;
Bandi Sanjay (tv5news.in)
Bandi Sanjay: తెలంగాణలో పట్టుబిగించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం తర్వాత ఆ పార్టీలో మరింత జోష్ కనిపిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మరింత దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు మీద సవాలు విసురుతున్నారు. బీజేపీ ఎక్కడుంది అంటూ ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గులాబీ నేతలకు పార్టీ సత్తా ఏంటో చూపించామనేది కాషాయ నేతల ధీమా.
బీజేపీ, బండి సంజయ్ ల కోసం సీఎం కేసీఆర్ గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి దింపామంటున్నారు కమలం పార్టీ నేతలు. ఏ అండ చూసుకుని బండి సంజయ్.. సీఎం కేసీఆర్ తో ఢీకొడుతున్నారంటూ చర్చ కూడా జరిగింది. అయితే బండి సంజయ్ వెనుకున్నది మరెవరో కాదు... సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ నాకత్వమే అని కమలం పార్టీ నేతలే అంటున్నారు.
జాతీయ నాయకత్వం ఆదేశాలతోనే బండి సంజయ్.. కేసీఆరే టార్గెట్ గా పదునైన విమర్శలు చేస్తూ వచ్చారనేది బీజేపీ శ్రేణుల మాట. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఇదే వ్యూహాన్ని అనుసరించాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ ను ఢీకొట్టడం అంత ఈజీకాదనే విషయం బీజేపీకి తెలియంది కాదు.
ఒకేసారి రాష్ట్రంపై విరుచుపడితే.. వ్యతిరేకమైన ఫలితాలు కూడా రావచ్చు అనేది బీజేపీ నేతల భయం. అందుకే కాషాయ పార్టీ నేతలు వ్యూహం మార్చారు. అదను చూసి దెబ్బకొట్టడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ప్రభుత్వ విధానాలపై దశవారిగా పోరు ఉదృతం చేసింది.
నిరుద్యోగుల సమస్యలు, రైతు సమస్యలు, పోడుభూములు, డబల్ బెడ్రూం ఇళ్లు.. ఇలా చాలా సమస్యలపై ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేసిన ఫలితంగానే పార్టీ పుంజుకుంటున్నట్లు కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయినట్లు బీజేపీ భావిస్తోంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.
వాస్తవాలను పక్కన పెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ కేడర్ విమర్శిస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని చెప్పడంలో తమ పార్టీ సక్సెస్ అయిందనేది బీజేపీ నేతల అంచనా. అందుకే బీజేపీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అండగా జాతీయ నాయకత్వం సైతం తన వంతు సహాయసహకారాలు అందిస్తోందని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యనేతలకు జాతీయ స్థాయిలో పదవులు ఇవ్వడమే కాకుండా మొదటిసారి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇక తాజాగా రాష్ట్ర నాయకత్వానికి అండగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం అందించేందుకే వారు మీడియా ముందుకు వస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే తీరుపై తమ పార్టీ నేతలు వివరణ ఇస్తున్నారనేది బీజేపీ నేతల మాట. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్ లు ఇప్పటికే తమ పరిధిలోని అంశాలను బయట పెట్టారని.. రాబోయే రోజుల్లో మరిన్ని వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు కేంద్ర మంత్రులు సిద్దంగా ఉన్నారంటున్నాయి పార్టీ వర్గాలు.
కేంద్ర మంత్రుల వరుస మీడియా సమావేశాలు సంజయ్ కి సపోర్ట్ గా నిలిచాయి. అయితే ఇదంతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చొరవతోనే జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకాత్వానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందస్తామన్న జాతీయ నాయకత్వం హామీతో ఫుల్ ఖుషీగా ఉంది బీజేపీ క్యాడర్.