Bandi Sanjay Padayatra: మరో మైలురాయికి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర..

Bandi Sanjay Padayatra: తెలంగాణ బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మరో మైలురాయిని దాటింది.

Update: 2022-08-17 10:00 GMT

Bandi Sanjay Padayatra: తెలంగాణ బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మరో మైలురాయిని దాటింది. 82 రోజుల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన యాత్ర 1000 కిలోమీటర్లు దాటింది. పాలకుర్తి నియోజకవర్గంలోని అప్పిరెడ్డిపల్లె వద్ద బండి సంజయ్‌ పాదయాత్ర సరిగ్గా వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ పైలాన్‌ను ఆవిష్కరించారు. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మార్క్‌ను పూర్తిచేయడంతో జిల్లా కమలం కార్యకర్తలు భారీ ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. వెయ్యి బెలూన్లను గాల్లోకి ఎగురవేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు భారీగా టపాసులుపేల్చుతున్నారు.

మొదటి విడత పాదయాత్ర పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై.. అక్టోబర్ 2 హుస్నాబాద్‌లో ముగిసింది. తొలి విడతలో 36 రోజుల పాటు సాగిన యాత్రలో బండి సంజయ్ 438 కి.మీటర్లునడిచారు. 9 జిల్లాలు 19 అసెంబ్లీ నియోజక వర్గాలు, 6 ఎంపీ సెగ్మెంట్లను బండి సంజయ్ కవర్ చేశారు. ఇక రెండో విడత పాదయాత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న అలంపూర్ జోగులాంబ అమ్మవారిఆలయం నుంచి ప్రారంభమైంది. 31 రోజుల పాటు సాగిన రెండో విడత పాదయాత్ర మే 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ముగిసింది.

రెండో విడతలో 3 ఎంపీ, 9 అసెంబ్లీ సెగ్మెంట్లతో 5 జిల్లాల మీదుగా 383కి.మీటర్లు సాగింది బండి సంజయ్ యాత్ర. తాజాగా కొనసాగుతున్న మూడో విడత యాత్ర ఈ నెల 2న ప్రారంభమైంది. 15 రోజులు సాగిన ఈ యాత్ర నేటితో 183 కి.మీటర్లకు చేరుకోనుంది. ఇవాళ కోలుకొండ నుంచి చీతూరు, కిష్టగూడెం మీదుగా కుందారం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. 15 కిలోమీటర్ల పాటు సాగనున్న యాత్ర.. జనగామ నియోజకవర్గంలోని కుందారం వద్ద ముగియనుంది. కుందారంలోనే రాత్రి బస చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కిష్టగూడెంలో భోజనం చేసి, అనంతరం రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో సమావేశం అవుతారు బండి సంజయ్.

మధ్యాహ్నం జరిగే కీలక సమావేశంలో ఈ నెల 21న మునుగోడులో జరిగే అమిత్‌షా సభపై చర్చిస్తారు. బహిరంగ సభకు జనసమీకరణ, పార్టీలో చేరికలపైనే చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు చర్చించనున్నారు. మరోవైపు ఈ నెల 26న వరంగల్‌లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు బహిరంగసభలు ఉండడంతో కమలనాథులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఒక సభ నిర్వహించలా? రెండు సభలు నిర్వహించలాఅనే దానిపై ఈ మీటింగ్‌లో సమాలోచనలు చేయనున్నారు. మొత్తానికి మునుగోడు, వరంగల్ సభలపై ఆఫీస్ బేరర్స్ సమావేశం తర్వాత క్లారిటీ రానుంది.

Tags:    

Similar News