Bandi Sanjay : బండి సంజయ్ 'నాల్గవ విడత సంగ్రామ యాత్ర'కు అంతా రెడీ..
Bandi Sanjay : టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. నాల్గో విడత ప్రజాసంగ్రామ యాత్రకు రంగం సిద్ధమైంది;
Bandi Sanjay : టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. నాల్గో విడత ప్రజాసంగ్రామ యాత్రకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రూట్ మ్యాప్‌ను ఫైనల్ చేసిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం, యాత్ర సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత పాదయాత్రలో జరిగిన సంఘటనల నేపథ్యంలో.. ఈసారి మరింత పగడ్బందీగా యాత్రను కొనసాగించాలని నిర్ణయించారు. నాల్గో విడత యాత్ర.. సెమీ అర్భన్ ఏరియాలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చిత్తారమ్మ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. పదిరోజులపాటు సాగే పాదయాత్ర.. నగర శివార్లలోని 9 నియోజకవర్గాల గుండా 115 కిలోమీటర్లు సాగనుంది. మొదటి విడత ప్రజాసంగ్రామ యాత్ర.. చార్మినార్, గోషామహల్, కార్వాన్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో చేసినా, అది కేవలం పాదయాత్రకే పరిమితమైంది. ఎక్కడా స్పీచ్‌లు లేకపోవడంతో కేడర్‌లో నిరుత్సాహం నెలకొందన్న టాక్ వినబడుతోంది. అందుకే నాల్గో విడత యాత్రలో టీఆర్‌ఎస్ టార్గెట్‌గానే బండి సంజయ్ స్పీచ్‌లు ఉండబోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
నాల్గో విడత ప్రజాసంగ్రామ యాత్ర పూర్తిగా టీఆర్‌ఎస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లోనే సాగనుంది. కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో సాగనుంది. అయితే గతంలో తమ నియోజకవర్గంలో అడుగుపెట్టి చూడు బండి సంజయ్ అంటూ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు సవాల్ విసిరారు. దీంతో ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ఒకరిపై ఒకరు భౌతిక దాడులు సైతం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో బండి పాదయాత్ర ఏమేరకు సజావుగా సాగుతుందన్న చర్చ సాగుతోంది.
సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం ఉన్నందున బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ప్రధానంగా బీజేపీకి ఏమాత్రం పట్టులేని నియోజకవర్గాల్లో ప్రారంభంకానున్న పాదయాత్ర.. సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఇక్కడ పార్టీ బలం నిరూపించుకునేందుకు ఉపయోగపడుతుందని.. ఆ తర్వాత బలంగా ఉన్న ఎల్బీనగర్‌లోకి పాదయాత్రను ఎంట్రీ ఇచ్చి, ముగింపు సమావేశం కూడా ఇక్కడే పూర్తి చేయాలనే ఎత్తుగడ బీజేపీ వేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా సెమీ అర్బన్ ఓటర్లను తమవైపు తిప్పుకునేలా బీజేపీ నేతలు నాల్గో విడత ప్రజాసంగ్రామ యాత్ర సిద్ధం చేశారని టాక్ వినబడుతుంది.
మొత్తానికి టీబీజేపీ అధ్యక్షుడు చేపట్టనున్న నాల్గో విడత పాదయాత్ర ఎన్నో సవాళ్లతో కూడుకుంది. గత పాదయాత్రలో దాడులు ఎదుర్కొన్న బండి సంజయ్.. గ్రేటర్ పరిధిలో నిర్వహించే పాదయాత్రలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటారో చూడాలంటే వేచి చూడాలి.