Bariatric Surgery in Osmania: ఉస్మానియాలో బేరియాట్రిక్ సర్జరీ.. 240 కేజీల బరువున్న యువకుడికి..

Bariatric Surgery in Osmania: అపర కుబేరులు అంబానీ కొడుకుల్లాంటి వాళ్లైతే అమెరికాలో బరువు తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుంటారు.

Update: 2023-02-22 07:14 GMT

Bariatric Surgery in Osmania: అపర కుబేరులు అంబానీ కొడుకుల్లాంటి వాళ్లైతే అమెరికాలో బరువు తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుంటారు. మరి జీవనం గడవడమే అంతంత మాత్రం ఉన్న వారికి కనీసం కార్పొరేట్ ఆస్పత్రి మెట్లెక్కాలంటే కూడా భయపడిపోతారు. అలాంటి వారి కోసమే తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అన్ని అధునాత సౌకర్యాలను ఏర్పాటు చేసి పేదవాడికి బ్రతుకు పైన ఆశలు కల్పిస్తోంది అధునాతన వైద్యం అందుబాటు ధరలోనే అందిస్తోంది.

అరుదైన వ్యాధులకు చికిత్స అందిస్తూ ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ఉన్న చులకన భావాన్ని తొలగిస్తున్నారు. తాజా సంఘటనతో ఉస్మానియా ఆస్పత్రి మరో సారి వార్తలకెక్కింది. 240 కిలో బరువున్న ఓ యువకుడికి బేరియాట్రిక్ సర్జరీ చేసి 70కిలోల బరువు తగ్గించారు. ఇప్పుడు ఆ యువకుడి బరువు 170 కిలోలు ఉంది. మరో 80-90 కిలోలు తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు వివరించారు.

హైదరాబాద్ గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన మునీందర్ (24) పుట్టినప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నాడు. వయసుతో పాటు అతడి బరువు కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అతడికి 24 ఏళ్ల వయసు వచ్చేసరికి 240 కిలోల బరువుకు చేరుకోవడంతో నడవడం కూడా కష్టంగా మారింది. దీంతో అతడిని తల్లిదండ్రులు తిప్పని ఆస్పత్రి లేదు. ఎక్కడికి వెళ్లినా దాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు.

అంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో వైద్యం చేయించడం వాయిదా వేద్దామనుకున్నారు. కానీ ఉస్మానియా ఆస్పత్రిని సంప్రదించమని ఇరుగు పొరుగు వారు చెప్పడంతో అక్కడి వైద్యులకు తమ బిడ్డ పరిస్థితి వివరించారు. ఉస్మానియా వైద్యులు అతడికి చికిత్స చేయడాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 15 మంది వైద్యులు ఒక బృందంగా ఏర్పడి మునీందర్‌కి బేరియాట్రిక్ సర్జరీ చేశారు. ఇలాంటి సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయడం చాలా తక్కువ. ఈ సర్జరీ ద్వారా యువకుడి బరువు దాదాపు 70 కిలోలు తగ్గించారు. సర్జరీలో భాగంగా పొట్ట పరిమాణం తగ్గించడంతో పాటు, ఆహారం స్వీకరించే చిన్న పేగును కొంత మేరకు తగ్గించారు. రెండు నెలల కిందట ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.

అధిక బరువుతో బాధపడుతున్న మునీందర్‌కు అన్నీ అనారోగ్య సమస్యలే. మోకాళ్లపై భారం పడడంతో నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి. మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర శారీరక, మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నాడు. అతడి పరిస్థితి చూసి చలించిన ఉస్మానియా వైద్యులు అతడికి వైద్యం అందించడానికి సిద్ధపడ్డారు. ఆపరేషన్ చేసే సమయంలో అతడి భారీ శరీరాన్ని బల్లపై పడుకోపెట్టడం కూడా కష్టంగా మారింది. శరీరానికి రెండువైపులా అదనపు బల్లలు ఏర్పాటు చేసి అతి కష్టం మీద సర్జరీ పూర్తి చేశారు. ఉస్మానియా వైద్యుల సేవలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. బేరియాట్రిక్ సర్జరీలో పాల్గొన్న వైద్యుల బృందాన్ని అభినందించారు. మునీందర్ తల్లిదండ్రులు సైతం వైద్యులకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. తమ బిడ్డ కష్టాలు త్వరలోనే తీరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News