గత ఐదు రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ఈ వరద ధాటికి బాసర పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నదిలో బ్యాక్ వాటర్ కారణంగా బాసరలో గంటగంటకు నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. వేగంగా పెరుగుతున్న వరద నీరు బాసర సరస్వతి దేవి ఆలయం వరకు వచ్చి చేరింది. ఆలయానికి సమీపంలో ఉన్న వేదవ్యాస ఆలయాన్ని ఇప్పటికే వరద నీరు తాకుతూ ప్రవహిస్తోంది. ఇప్పటికే బాసర పట్టణంలోని పలు దుకాణాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు.