bhatti: ఏపీ మంత్రులకు భట్టీ కీలక సూచన
బనకచర్ల అప్పుడు కట్టుకోవచ్చని సూచన;
తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదని సూచించారు. ఏపీ మంత్రి లోకేశ్ తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయకూడదన్న భట్టి.. 2 లక్షల ఎకరాలు మునిగిపోకుండా పోలవరం కట్టుకోవచ్చన్నారు. ముంపు గ్రామాల ప్రజల తరఫున పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. కనీసం గతంలో కాంగ్రెస్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను కూడా ఆ పార్టీ పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.
‘‘కృష్ణా నదిపై భారత రాష్ట్ర సమితి ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత బనకచర్ల కట్టుకోవచ్చు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదు. తెలంగాణకు ద్రోహం చేసింది.. భారత రాష్ట్ర సమితి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు కాబట్టే బనకచర్ల ప్రాజెక్టు ఆగింది" అని భట్టీ వెల్లడించారు.