ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2 నిందితుడు మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో భుజంగరావు సోమవారం సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో అనారోగ్యంతో ఉన్న భుజంగరావుకు వైద్య సేవల నిమిత్తం కోర్టు 15 రోజుల పాటు అనుమతి ఇచ్చింది.
మధ్యంతర బెయిల్ సమయంలో హైదరాబాద్ సిటీ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఏసీపీ భుజంగరావు ఏ2గా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీతరావును అరెస్ట్ చేసిన అనంతరం ఈ ఏడాది మార్చి 23వ తేదీన భుజంగరావును సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి భుజంగరావు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాదపడుతున్నానని, చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు ఆయనకు షరతులతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.