BJP Meeting: కార్యవర్గ సమావేశాలకు వారం గడువు.. ఏర్పాట్లపై బీజేపీ ఫోకస్..
BJP Meeting: HICCలో జులై 1 నుంచి జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ నేతలు భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారు;
BJP Meeting: హైదరాబాద్ HICCలో జులై ఒకటి నుంచి జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ నేతలు భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.. మరో వారం మాత్రమే గడువు ఉండటంతో బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా, హోంమంత్రి అమిత్ షా ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇక ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్రమంత్రులకు మరో వేదికను సిద్ధం చేస్తున్నారు. అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులు, పదాధికారులకు మరో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు.
అటు ఈ కార్యవర్గ సమావేశాలు జరిగే ప్రాంగణంలో భూమి పూజ చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. భూమి పూజ కార్యక్రమానికి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, కార్యవర్గ సమావేశాల ఇన్‌ఛార్జ్ అరవింద్ మీనన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భూమిపూజ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.. సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవంద్ర, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అదికారులు హాజరయ్యారు.. రెండు రోజులపాటు మోదీ సహా బీజేపీ అగ్రనేతలు హెచ్‌ఐసీసీలో ఉండనున్న నేపథ్యంలో భద్రత, పార్కింగ్, ఇతర సదుపాయాలపై చర్చించారు..
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఇక పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీ కసరత్తులు చేస్తోంది బీజేపీ. తెలంగాణలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర హైకమాండ్ కో-ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించారు.. సభకు పది లక్షల మంది వరకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.. 16 రైళ్లను బుక్ చేసిన బీజేపీ నేతలు.. నగర శివార్ల నుంచి మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా సభకు ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేశారు.
ఇప్పటికే 5 వేల ప్రైవేటు బస్సులతో పాటు ఇతర వాహనాలను రెడీ చేసినట్లు తెలుస్తోంది. రోజువారీగా జిల్లా, మండల అధ్యక్షులు, కార్యకర్తలతో నిత్యం టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న బీజేపీ నేతలు.. సభా ఏర్పాట్లపై అధికారులతోనూ సమీక్షా సమావేశం జరుపుతున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ పట్ల బీజేపీ విధానాన్ని ప్రధాని మోదీ ప్రకటిస్తారని కమలం నేతలు చెప్తున్నారు. అటు పరేడ్ గ్రౌండ్ సభ కోసం అన్ని శాఖలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఎంపీ అర్వింద్, ఏనుగు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. పోలీస్, విద్యుత్, వాటర్ వర్క్స్, ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ఎంట్రీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరొకటి సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలకు ఇంకో ఎంట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరేడ్‌గ్రౌండ్స్‌లోకి వచ్చే ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తామన్నారు జాయింట్ సీపీ చౌహాన్. రూట్ వారీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఇచ్చి గైడ్ చేయాలని సిబ్బందికి సూచించారు.
ప్రధాని మోదీ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీజేపీ తెలంగాణను ఎంత సీరియస్‌గా తీసుకుందో ఈ సమావేశాలను బట్టి అర్థమవుతోందన్నారు. కచ్చితంగా ఈసారి తెలంగాణలో పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు ప్రధాని మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. పరేడ్ గ్రౌండ్స్ సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో మరింత పట్టు పెంచుకోవచ్చని భావిస్తున్నారు.