BJP Telangana : అధికారమే లక్ష్యం, క్షేత్ర స్ధాయిలో పోరాటం

ప్రజల మధ్య ఉండేందుకు నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే గుర్తించగా.. అందుకోసం పోరాటాలకు సన్నాహాలు చేస్తున్నారు

Update: 2023-03-05 08:15 GMT

జాతీయ నాయకత్వం ఇచ్చిన టాస్క్ పూర్తి చేసేందుకు బీజేపీ తెలంగాణ నాయకత్వం సమాయత్తం అవుతోంది. ప్రజల మధ్య ఉండేందుకు నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే గుర్తించగా.. అందుకోసం పోరాటాలకు సన్నాహాలు చేస్తున్నారు.. దీక్షలతో పాటు క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఉద్యమ కార్యాచరణ అమలు చేసి విస్తృతంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు కమలం నేతలు యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు.

తెలంగాణలో మరోమారు బీజేపీ ప్రజాందోళన బాట పట్టబోతోంది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా కేసీఆర్ పాలనపై సంతృప్తి కరంగా లేదంటూ గత కొంత కాలంగా చెబుతూ వస్తున్న బీజేపీ నాయకత్వం వారి తరపున పోరాటాలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని.. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్న నేతలు.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న విషయాలను కూడా ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండొచ్చంటూ సబ్బండ వర్గాలను ఉద్యమంలోకి ఆహ్వానించిన కేసీఆర్... రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నారు తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు.. ప్రభుత్వం ఏర్పాటు చేసి తొమ్మిదేళ్లు పూర్తైనా ఇప్పటికీ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులు, యువతులపై నిత్యం అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. దీంతో నిత్యం ఏదో ఓ చోట మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని విమర్శిస్తోంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వంతో పాటు పోలీసులు సైతం వైఫల్యం చెందారని ఆరోపిస్తోంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అరికట్టాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగుతున్నారు. సోమవారం రోజు ఒక రోజు దీక్షకు దిగబోతున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శిస్తున్న బండి సంజయ్ తాజాగా ప్రీతి ఘటనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యం కారణంగానే ప్రీతి చనిపోయిందని విమర్శించారు.. ఇది లవ్ జిహాద్ కేసంటూ ఘాటైన ఆరోపణలు చేశారు.. ఈ నేపథ్యంలోనే మహిళలు, విద్యార్థులపై జరుగుతున్న దారుణాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని దీక్ష కు దిగుతున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.


మరోవైపు తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు ఇస్తున్న రాష్ట్ర సర్కార్ మిగతా సబ్సిడీలకు నీళ్లొదిలిందంటూ విమర్శిస్తున్నారు. మరోవైపు భూ ప్రక్షాళన అంటూ తీసుకుని వచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్ రాకతో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు ఇతర పేర్లతో నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గతంలో తప్పులను సరిదిద్దే బాధ్యత ఎమ్మార్వోకు ఉండేది.. ఇప్పుడు కలెక్టర్‌కు ఆ అధికారం ఇవ్వడంతో తమ సమస్యలు ఏళ్ల తరబడి అలాగే పేరుకు పోతున్నాయని.. ప్రభుత్వంపై రైతులు గుర్రుగా ఉన్నారని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. రైతుల ధరణి పోర్టల్‌తో పడుతున్న ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కమలం నేతలు సిద్ధమవుతున్నారు.

మొత్తానికి జాతీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన బీజేపీ రాష్ట్ర నేతలు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేయబోతున్నామని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News