BJP: పేలుళ్లకు బీజేపీతో ఏం సంబంధం..?
బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ పేలుళ్లపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అసహనం వ్యక్తం చేశారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని, బాంబు పేలుళ్లతో బీజేపీకి ఏం సంబంధం అంటూ ఫైరయ్యారు. ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం కూడా దేశద్రోహం కిందికే వస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టర్ వరకూ నిర్వహించిన సర్దార్ -ఏక్తా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. బాంబు పేలుళ్ల వెనుక బీజేపీ ఉందంటూ వస్తోన్న పోస్టుల్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలొస్తే బ్లాస్టులు జరుగుతాయని సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
200 ఐఈడీ బాంబులు.. 26/11 తరహా దాడులకు కుట్ర
ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనుమానిస్తోంది. టార్గెట్ లిస్ట్‌లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇందుకోసం భారీగా బాంబులను కూడా తయారుచేస్తున్నట్లు పేర్కొన్నాయి. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి పథక రచన చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
టెర్రర్ మాడ్యూల్‌కు తుర్కియే లింకులు
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించిన కీలక విషయాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మాడ్యూల్లో కీలక వ్యక్తులుగా ఉన్న డాక్టర్ ఆదిల్, ముజమ్మిల్లకు తుర్కియే హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఏడాది ప్రారంభంలో వీరు తుర్కియేలో పర్యటించినట్లు, వీరి బస ఏర్పాట్లను అక్కడి హ్యాండ్లర్లే చూసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో వారితో కలిసి ఈ మాడ్యూల్ సభ్యులు కుట్రలు పన్నినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్ర నెట్‌వర్క్‌కు విదేశాల నుంచి ఆర్థిక మద్దతు లభించినట్లు దర్యాప్తులో తేలింది. 2023-24 మధ్య కాలంలో ఇస్తాంబుల్, దోహా నుంచి డిజిటల్ వాలెట్ల ద్వారా వైద్యుల్లో ఒకరికి విదేశీ నిధులు అందినట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. మరోవైపు, అరెస్టయిన మహిళా డాక్టర్లలో ఒకరికి చెందిన బ్రెజా కారుపై అధికారులు దృష్టిసారించారు. ఆ కారులో పేలుడు పదార్థాలు ఉండవచ్చని అనుమానిస్తూ దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టయిన ఇద్దరు మహిళా డాక్టర్ల సోషల్‌మీడియా చాట్లను కూడా అధికారులు పరిశీలించారు. నిధుల బదిలీలు, లాజిస్టిక్స్, సురక్షిత ప్రదేశాలు గురించి వారు అందులో చర్చించినట్లు గుర్తించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఈ మహిళా డాక్టర్లు, శ్రీనగర్‌లో ఇంటర్న్‌షిప్ సందర్భంగా మత బోధకుడు ఇర్ఫాన్ అహ్మద్‌తో ఏర్పడిన పరిచయంతోనే ఉగ్రవాద భావజాలం వైపు మొగ్గు చూపినట్లు అధికారులు తెలిపారు. తుర్కియే హ్యాండర్లతో ఈ మాడ్యూల్‌కు ఉన్న సంబంధాలపై నిఘా సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.