Bodhan: చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసి..

బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. రోడ్ల మీద వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ మధ్య వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది.;

Update: 2024-09-11 07:21 GMT

బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. రోడ్ల మీద వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ మధ్య వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది. మున్సిపాలిటీ సిబ్బంది అప్రమత్తమై వీధి కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా వుంది. 

తాజాగా నిజామాబాద్ జిల్లాలో వీధికుక్కలు దాడి చేయడంతో 10 నెలల బాలుడు బలయ్యాడు. బాలుడి మృతదేహం లభ్యమైన తీరు.. చిన్నారిని కుక్కలు ఏ విధంగా పీక్కుతిన్నాయో అర్ధమవుతోంది. ఈ ఘోర ఘటన బోధన్ లో చోటు చేసుకుంది. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే లక్ష్మి అనే మహిళ మంగళవారం (సెప్టెంబర్ 10) బోధన్ బస్టాండ్ కు సమీపంలో.. పెద్దగా జనసంచారం లేని ప్రాంతంలో రోడ్డుపై తన 10 నెలల బాబుని పడుకోబెట్టి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి బాబు అక్కడ లేడు. చుట్టు పక్కల వెతికింది. ఎక్కడో దూరాన కుక్కలు కనిపించాయి. అవే తన బిడ్డను ఎత్తుకెళ్లి ఉంటాయని ఊహించింది. 

దాంతో లక్ష్మి బోధన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు.. బాబు కోసం గాలించారు. పరిసర ప్రాంతాల్లో అన్వేషించగా..  బాలుడి శరీర భాగాలు కనిపించడంతో.. కుక్కలు పీక్కుతిన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. దీంతో బాబును కుక్కలు ఎత్తుకెళ్లి దాడిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. లభ్యమైన పేగులు, అవయవాలు చిన్నారివో కాదో తెలుసుకునేందుకు పోలీసులు వాటిని వైద్య పరీక్షలకు పంపారు. రిపోర్ట్ వచ్చాక.. ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తామని సీఐ వెంకట నారాయణ వెల్లడించారు.

Tags:    

Similar News