KCR: తెలంగాణ రక్షకులం మనమే: కేసీఆర్

బలంగా కొడతానన్న బీఆర్ఎస్ అధినేత... ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు;

Update: 2025-02-01 02:00 GMT

తెలంగాణ ప్రజలు అత్యాశకు పోయి.. తాను చెప్పినా వినకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను రేవంత్ ప్రభుత్వం ఎండబెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతు బంధుకి రాంరాం.. దళిత బంధుకు జై భీం చెప్పేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనపై అంతటా అసంతృప్తే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తులం బంగారానికి ఆశపడి ప్రజలు హస్తం పార్టీకి ఓటేశారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలే కొట్టేటట్లు ఉన్నారన్న కేసీఆర్, .. రాబోయే రోజుల్లో విజయం తమదేనని అన్నారు. మన విజయం ప్రజల విజయం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలునిచ్చారు. కాంగ్రెస్ పెట్టిన పోల్ లోనే తమకు ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

నేను కొడితే మామూలుగా ఉండదు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటున్న కేసీఆర్ గళం విప్పారు. తెలంగాణ శక్తి ఏపాటిదో చూపి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా... అన్నీ గంభీరంగా చూస్తూనే ఉన్నానని కేసీఆర్ అన్నారు. "నేను కొడితే మాములుగా ఉండదు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు" అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇది దండయాత్ర

నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పాలనపై... దండయాత్ర చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడేది.. ప్రాణాలు పోయే వరకు పోరాడేది మనమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను ముంచేసిందన్న ఆయన.. తెలంగాణకు రక్షణగా నిలబడాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన దెబ్బ ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News