బీఆర్ ఎస్ పార్టీకి రెబల్స్ బెడద పట్టుకుందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. కానీప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ ఎస్ కు ఆ మాత్రం సీట్లు రావడం కూడా ఒక రకంగా పెద్ద విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ ను గులాబీ పార్టీ పట్టించుకోలేదు. ఎవరు పోటీ చేసినా సరే గెలిచిన తర్వాత మన పార్టీలోనే ఉంటారు కదా అన్నట్టు లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుపై జరుగుతున్నాయి కాబట్టి ఈ సారి కచ్చితంగా రెబల్స్ ను బుజ్జగించాల్సిందే అని పార్టీ అధినేత కేసీఆర్ భావించారంట. ఎందుకంటే రెబల్స్ కచ్చితంగా కారు గుర్తుపై పడే ఓట్లనే చీలుస్తారనేది కేసీఆర్ ఆలోచన. అందు భాగంగానే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో రెబల్స్ ను బుజ్జగించే బాధ్యతను ఆయా జిల్లాల లీడర్లకు అప్పగించారంట కేసీఆర్. గతంతో పోలిస్తే ఈ సారి రెబల్స్ బెడద ఎక్కువగానే ఉందనేది కేసీఆర్ కొన్ని నివేదికల ద్వారా తెలుసుకున్నారంట. అయితే పార్టీ బీఫామ్ ఎవరికి ఇవ్వాలనేది కూడా ఇప్పటికే సర్వేల ద్వారా తేలిపోయిందని సమాచారం. పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల, రెబల్స్ తో ఆయా మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జులు సమావేశాలు నిర్వహించి ఒక్క తాటిపైకి తీసుకురావాలని సూచించారంట కేసీఆర్.
అయితే చాలా జిల్లాల్లో రెబల్స్ తమకు టికెట్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని తేల్చి చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే వారంతా నామినేషన్లు కూడా వేసినట్టు తెలుస్తోంది. నామినేషన్ ఉపసంహరణకు రేపు ఒక్క రోజే ఛాన్స్ ఉండటంతో.. వారితో పార్టీ అగ్ర లీడర్లు చర్చలు జరుపుతున్నారంట. మరి ఎంత మంది ఉపసంహరించుకుంటారు.. ఇంకెంత మంది బరిలో నిలుస్తారనేది రేపటితో తేలిపోనుంది.