Chalo Medigadda : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కౌంటర్ అటాక్

రాజకీయ వైరంతో ప్రాజెక్టులకు ముప్పు కలిగించొద్దన్న కేటీఆర్

Update: 2024-02-28 04:15 GMT

కాళేశ్వరంపై ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మార్చి ఒకటిన మేడిగడ్డకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజీ మాత్రమే కాదని... మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల సహా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని వెల్లడించారు. ఆకలి కేకల తెలంగాణ.. కాళేశ్వరం వల్ల అన్నపూర్ణగా మారిందని వ్యాఖ్యానించారు.

మేడిగడ్డ సహా మూడు ఆనకట్టలు కూలిపోవాలన్న నేరపూరిత నిర్లక్ష్య ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న ఎస్సారెస్పీని ఎండబెట్టే ప్రయత్నం చేసిందని ఆక్షేపించారు. కాళేశ్వరంలో ప్రతిసారి మేడిగడ్డ నుంచి నీరు తీసుకోవాల్సిన అవసరం లేదని... కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద వచ్చినా నీటిని ఎత్తిపోసుకునేలా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. శ్రీరాంసాగర్ కళకళలాడుతోందన్నా సూర్యాపేట, తుంగతుర్తి, డోర్నకల్ వరకు తడి ఆరకుండా చివరి మడి వరకు నీరందిందన్నా.. కాళేశ్వరమే కారణమని వెల్లడించారు. దశాబ్దాల కరవు నుంచి రాష్ట్రానికి లభించిన ఉపశమనానికి ఏ విధంగా లెక్కగడతారని కేటీఆర్‌ ప్రశ్నించారు. 3 పిల్లర్లు కుంగితే... బ్యారేజీ మెుత్తం కొట్టుకుపోయినట్లు చెప్పడం సమంజసం కాదని మండిపడ్డారు.

 ఉమ్మడి ఏపీలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టించిందని KTR ఆక్షేపించారు. కాంగ్రెస్ గతంలో జలయజ్ఞం చేపట్టిందని.... అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను సజీవంగా చూపాలన్న ఉద్దేశంతో మార్చి ఒకటో తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రజలకు వాస్తవలు తెలిపేందుకు ప్రాజెక్టు మొత్తాన్ని సమగ్రంగా సందర్శిస్తామని స్పష్టం చేశారు..

పిల్లర్లు కుంగుబాటుకు గురైతే పునరుద్ధరణపై దృష్టిసారించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ లోపాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మాని పరిష్కారం చూపాలన్న ఆయన తమపై కక్షతో నీళ్లు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు

Tags:    

Similar News