Telangana BRS: బీఆర్ఎస్‌లో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలు

Update: 2023-08-24 08:34 GMT

రోజురోజుకు బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ దక్కని నేతలు అధిష్టానాన్ని టార్గెట్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబావుట ఎగురవేశారు. ఖానాపూర్‌ టికెట్‌ కోసం కాంగ్రెస్‌కు దరఖాస్తు చేసుకున్నారు ఆమె. మరోవైపు రేఖా నాయక్ భర్త రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

పౌరసత్వ వివాదంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కేసీఆర్‌ టికెట్ నిరాకరించారు. దీంతో చెన్నమనేని బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు చెల్మెడకు సహకరించమంటున్నారు ఆయన అనుచరులు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో కడియం ర్యాలీకి డుమ్మా కొట్టారు రాజయ్య. దీంతో రాజయ్యను బుజ్జగించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రాజయ్య ఇంట్లో లేకపోవడంతో పల్లా వెనుదిరిగారు. మొత్తానికి రాజయ్యకి అధిష్టానం ఎంపీ టికెట్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. అదేవిధంగా నల్గొండ నేత ఢిల్లీ రామరాజు యాదవ్ బీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ను మార్చకపో తే.. మూకుమ్మడిగా రాజీనామాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అదేవిధంగా దేవరకొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ నాయక్‌ను మార్చాలంటూ మండలాల వారీగా తీర్మానాలు చేశారు. తొందరిలో అధిష్టానానికి పంపనున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్‌లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎంపీ నామా నాగేశ్వరరావు కలిశారు. గంటకు పైగా చర్చలు జరిపారు. అయితే తుమ్మల అలకవీడి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News