BRS | లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ రెడీ
నేటి నుంచి నియోజకవర్గాలవారీగా సమీక్షలు;
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన భారత రాష్ట్ర సమితి ఇవాళ్టి నుంచి లోక్‌సభ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించనుంది. తెలంగాణభవన్ వేదికగా నేటినుంచి ఆదిలాబాద్‌తో ప్రారంభించి నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యనేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకొని పార్లమెంట్ ఎన్నికలకి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. రెండు విడతల్లో జరగనున్న సమావేశాలను 21 వ తేదీతో ముగించి... గణతంత్ర దినోత్సవం తర్వాత క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది.
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ సమాయత్తమవుతోంది. అందులోభాగంగా నేటి నుంచి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆనియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు,మాజీలు, ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగాపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, సీనియర్ నేతలు మధుసూధనాచారి, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యులు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలని సమావేశాలకు ఆహ్వానించారు. నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, MLA, MLC, జెడ్పీఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు సహా ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేపథ్యంలో...అధిగమించి మరీ లోక్‌సభ ఎన్నికలకు నేతలు, శ్రేణులను సన్నద్ధం చేయడంపై దృష్టిసారిస్తారు. క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలను వినేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సమావేశంలో ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సీట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూనే లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకెళ్లే విషయమై చర్చించనున్నారు.
నేటి నుంచి సన్నాహక సమావేశాల నేపథ్యంలో పార్టీ ముఖ్యులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. KTR సహా కొందరుముఖ్యులతో మాట్లాడిన ఆయన నేతలు, శ్రేణులకు వివరించాల్సిన అంశాలపై సూచనలు చేసినట్లు తెలిసింది. రెండు విడతల్లో సన్నాహక సమావేశాలు జరగనుండగా ఆదిలాబాద్ నియోజకవర్గంతో ప్రారంభించనున్నారు. కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి నియోజకవర్గాల భేటీలు వరుసగా 12వతేదీవరకు జరగనున్నాయి. సంక్రాంతి అనంతరం తిరిగి 16వ తేదీన నల్గొండతో ప్రారంభమై నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల సమావేశాలు రోజుకొకటి చొప్పున జరగుతాయి. 21వ తేదీన సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాలతో సన్నాహక సమావేశాలు ముగుస్తాయి. సన్నాహక సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ సమావేశాలు జరగనున్నాయి. గణతంత్ర దినోత్సవం అనంతరం ఈ సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది.