HARISH: ఢిల్లీలో కాంగ్రెస్ కు మిగిలింది గాడిద గుడ్డే
తెలంగాణలోని మోసాలు బయటపడ్డాయన్న హరీశ్... ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్;
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు మిగిలిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. "మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి గార్ల పాత్ర అమోఘం. ఇక్కడ హామీలు అమలు చేయకుండా, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా? మీ గ్యారెంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన మీకు బెడిసికొట్టింది." అని హరీశ్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్ళీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలన్నారు. " ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి అప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేసుకోండి రేవంత్ రెడ్డి గారూ.. లేదంటే మీరు ఎక్కడ అడుగుపెట్టినా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ మీకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు." అని హరీశ్ రావు అన్నారు.
కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ కమలం నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఈ ఫలితాలపై స్పందించగా... తాజాగా మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా బీజేపీ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఓ నమ్మకమని... నిజాయతీ పాలన బీజేపీ తోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారని కిషన్ రెడ్డి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తున్నామని.. తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉందని.. దాన్ని గెలుపుగా మలచుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్
ఢిల్లీలో బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని తాము ముందే ఊహించామన్నారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో ఆప్ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బండి సంజయ్ స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు తమకు వద్దని ఢిల్లీ ప్రజలు ఆప్‌ను వద్దనుకున్నారు. అవినీతి, అక్రమాలతో జైలుకు వెళ్లిన వ్యక్తిని ఢిల్లీ తిరస్కరించిందని బండి సంజయ్ అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని... రాష్ట్రపతిని, ప్రధానిలను ఎదిరించి వారికిష్టం వచ్చినట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ పాలించిందన్నారు.