తమ పార్టీ ఎమ్మల్సీలపై (MLC) చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLC's) శాసన మండలిలో నిరసనకు దిగారు. నల్ల కండువాలతో వచ్చి పోడియంను చుట్టుముట్టారు. దీంతో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను పది నిమిషాలపాటు వాయిదావేశారు.
ఈ సందర్భంగా సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు మండలి చైర్మన్ తెలిపారు. మండలి సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అవమాన పరిచారని, సీఎం వెంటనే క్షమాణలు చెప్పాలని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. సభా గౌరవ మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు.
మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ తో రోడ్డు మీద పడ్డ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు.