BRS: నేడే బీఆర్ఎస్ రజతోత్సవ సభ

భారీగా తరలివస్తున్న గులాబీ శ్రేణులు... చరిత్రలో నిలిచిపోతుందన్న బీఆర్ఎస్ నేతలు;

Update: 2025-04-27 05:00 GMT

బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నేడు వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 1200 ఎకరాల సభా స్థలంలో ఈ సభను భారీగా నిర్వహించనున్నారు. దాదాపు 10 లక్షల మంది బీఆర్ఎస్ శ్రేణులు ఈ సభకు హాజరవుతారని గులాబీపార్టీ అంచనా వేస్తోంది. బీఆర్‌ఎస్ 25 ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టేలా...క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చాటేలా ఈ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సభకు హాజరుకానుండడంతో ప్రజల్లోనూ ఆసక్తి పెరిగింది. సభలో కాంగ్రెస్ వైఫల్యాలు, అబద్ధాలను కేసీఆర్ ప్రజల ముందు ఉంచనున్నారు. ఉగ్ర దాడిపైనా కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది.

వరంగల్ సెంటిమెంట్

వరంగల్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్న గులాబీ పార్టీ.. మూడు జిల్లాల సరిహద్దుకు దగ్గర్లో ఉన్న ఎల్కతుర్తిలో ఈ సభను జరపనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు వివిధ మార్గాల్లో సభ ప్రాంగణానికి బయలు దేరాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బస్సుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మళ్లీ పూర్వ వైభవం తేవాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

పునరుత్తేజం కల్పించే దిశగా..

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు. రెండోసారి 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కేసీఆర్ పార్టీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక స్థానాలను కోల్పోయింది. ఈ ఎన్నికలకు ముందే మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రత్యేక కమిటీలు నియమించడం, సభలు ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు టీఆర్ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారింది. ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది.

Tags:    

Similar News