ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో 'నోటా' ఆప్షన్ లేకపోవడంతో, ఎవరికీ మద్దతు ఇవ్వకుండా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్, బీజేపీల విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ నాయకులు నిరంతరం విమర్శిస్తున్నారు. అదే సమయంలో, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ నాయకులు తరచుగా ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అభ్యర్థికీ మద్దతు ఇవ్వడం వల్ల విమర్శలు తప్పవని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఎన్నికలకు దూరంగా ఉండడమే సరైన నిర్ణయమని పార్టీ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాగా ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇండియా కూటమి తరపున తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. రాజకీయ తటస్థుడిగా పేరున్న సుదర్శన్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం లేదు. 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య నిరంతరం రాజకీయ విమర్శలు కొనసాగుతున్నందున, ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. తాజా పార్టీ నిర్ణయంతో వీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం లేదని సమాచారం.