KTR: అక్కాచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు: కేటీఆర్‌

కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్;

Update: 2024-08-16 03:15 GMT

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించండి అన్నారు. పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదని కేటీఆర్ అన్నారు. బస్సుల్లో సీట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఇంకా బస్సులను పెంచాలనే ఉద్దేశంతో అన్నానని తెలిపారు. బస్సుల్లో అల్లం, వెల్లుల్లి పొట్టులు తీసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క అన్న మాటలకు కేటీఆర్ రిప్లై ఇచ్చానని తెలిపారు.

బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటుంటే సీతక్కకు కనపడలేదా? అని ప్రశ్నించానని అన్నారు. మరిన్ని బస్సులు పెంచాలని డిమాండ్ చేశామని తెలిపారు. బస్సుల సంఖ్య పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డ్యాన్స్, రికార్డ్ డ్యాన్స్ చేద్దాం.. మాకేంటి అంటూ కేటీఆర్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకులేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా క్షమాపనలు కోరారు.

ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ సెటైర్లు వేశారు. బస్సులో కుట్లు-అల్లికలు వంటివి చేసుకుంటే తప్పేమిటని సీతక్క అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్... బస్సుల్లో కుట్లు, అల్లికలను తాము వద్దనడం లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకున్నా తమకు అభ్యంతరం లేదని చురక అంటించారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారని, బస్సులను పెంచాలని కోరారు.

Tags:    

Similar News