BYPOLL: నామినేషన్ దాఖలు చేసిన నవీన్ యాదవ్
హాజరైన మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. యూసుఫ్ గూడ నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు.నామినేష్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి,రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోకల్ కావటం ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురు అభ్యర్థులు గత కొన్ని ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. ముగ్గురికి పట్టు ఉన్న ప్రాంతం కావటంతో ఉప ఎన్నిక ఆసక్తిగా ఉత్కంఠగా మారింది.
41 ఏండ్ల నవీన్ యూసఫ్‌గూడకు చెందిన వారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. తెలంగాణ త్రోబాల్ అసోషియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఆయన 2014లో మొదటిసారి మజ్లిస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9 వేల పైచిలుకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. 2018లో ఇక్కడి నుంచే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్.. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ గెలుపు బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదే అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలి కాబట్టే నవీన్ యాదవ్‌ను పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిందని వెల్లడించారు.