CBN: "ఇక్కడ ఉన్నది చంద్రబాబు జాగ్రత్త"
రౌడీయిజాన్ని సహించేదే లేదన్న ముఖ్యమంత్రి... సూపర్ సిక్స్ ను సమర్థంగా అమలు చేశాం.. త్వరలో 700 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం: సీఎం
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం, వారి రాజకీయ స్వాభిమానాన్ని జాతికి గుర్తింపుగా నిలబెట్టడమే లక్ష్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలుగువారిని ‘మదరాసి’ అంటూ అవహేళన చేసిన పరిస్థితుల్లో, “తెలుగుజాతి అనే ఓ ప్రత్యేక అస్తిత్వం ఉంది” అని దేశానికి గర్వంగా చాటిచెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన విస్తృతంగా ప్రసంగిస్తూ, ఎన్టీఆర్ రాజకీయ జీవితం, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా మాట్లాడారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. బీసీ వర్గాలకు ఎన్టీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు చెప్పారు. “స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.
ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభించిన అన్నదాన పథకం ఎంతో గొప్పదని చంద్రబాబు గుర్తు చేశారు. “తితిదేలో అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. నేడు లక్షలాది మంది భక్తులు అన్నదానం పొందుతున్నారంటే, దానికి మూలకారణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయమే” అని చెప్పారు. కృష్ణా నదిలో మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉందని మొదటిగా గళమెత్తింది కూడా ఎన్టీఆర్‌నేనని చంద్రబాబు గుర్తు చేశారు. “మనకూ కృష్ణా జలాల్లో హక్కు ఉందని ధైర్యంగా చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత తనదేనని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ప్రాంతాల మధ్య సమతుల్యత కోసం ఎన్టీఆర్ చూపిన దూరదృష్టి నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోంది” అని వివరించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 700 అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. “పేదవాడికి కడుపునిండా భోజనం అందించాలన్నదే మా లక్ష్యం. అందుకే అన్నక్యాంటీన్ల సంఖ్యను భారీగా పెంచుతున్నాం” అని తెలిపారు. గృహనిర్మాణ రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కూడా చంద్రబాబు మాట్లాడారు.
రౌడీయిజానికి చోటు లేదు
శాంతిభద్రతల అంశంపై చంద్రబాబు నాయుడు కఠినంగా మాట్లాడారు. “శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. నాపై దాడి జరిగినా భయపడకుండా ప్రజల భద్రత కోసం పోరాటం చేశాను. రౌడీలకు రాష్ట్రంలో చోటు లేదని స్పష్టంగా చెప్పిన పార్టీ తెలుగుదేశం” అని అన్నారు.
రాజధాని అమరావతే
రాజధాని అంశంపై చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టత ఇచ్చారు. “సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటూ కొందరు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. బెంగళూరులో లేదా ఇడుపులపాయలో ఉంటే అక్కడే రాజధాని అవుతుందా? ప్రజలు మూడు ముక్కలాటను నమ్మలేదు కాబట్టే మూడు ప్రాంతాల్లోనూ మాకు విజయం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని గర్వంగా నినదిద్దాం” అని పిలుపునిచ్చారు.