BRS Chalo Medigadda; కాళేశ్వరాన్ని సజీవంగా చూపిస్తామంటున్న బిఆర్‌ఎస్‌ నేతలు…

నేడే చలో మేడిగడ్డ…

Update: 2024-03-01 01:00 GMT

కామధేనువంటి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రభుత్వ యత్నాన్ని తిప్పికొడతామని బీఆర్​ఎస్​ నేడు మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించనుంది. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు నీటిపారుదల నిపుణులు పర్యటనకు వెళ్లనున్నారు. అన్నారం వద్ద ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పనున్నట్లు బీఆర్​ఎస్​ నేతలు పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​ బృందం నేడు మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించనుంది. కాళేశ్వరంప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీపార్టీ ఈ పర్యటన చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్టలోని పియర్స్ కొన్నికుంగాయి. అన్నారం ఆనకట్టలో సీపేజీ సమస్య ఉత్పన్నం కావడంతో ఆ రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదిలి రెండింటిని ఖాళీచేశారు. ఆనకట్టలో నీరు నిల్వ చేస్తే ప్రమాదమని N.D.S.Aతో పాటు నిపుణులు చెప్పారని ప్రభుత్వం అంటోంది. ప్రస్తుతం అక్కడ పరీక్షలు కొనసాగుతుండగా.N.D.S.A సిఫార్సుల ప్రకారమే తదుపరి కార్యాచరణ చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వవాదనతో బీఆర్​ఎస్​ విభేధిస్తోంది. మేడిగడ్డలో కొన్ని పియర్స్ మాత్రమే కుంగితే ప్రభుత్వం మాత్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందిగా చూపేప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా ఆనకట్ట మొత్తం కొట్టుకుపోవాలన్న కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని బీఆర్​ఎస్​  మండిపడింది.

త్వరలో మేడిగడ్డ సందర్శించి కాంగ్రెస్ బండారంబయట పెడతామని నల్గొండ సభలో భారాస అధినేత KCR ప్రకటించారు. అందుకు అనుగుణంగా బీఆర్​ఎస్​ ప్రతినిధి బృందం... నేడు మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్ట వద్దకువెళ్తోంది. అధినేత మినహా.. పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పర్యటనలో పాల్గొననున్నారు. కొందరు విశ్రాంత ఇంజనీర్లు, నిపుణులు వారితో పాటు పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికీ కాఫర్‌డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోయవచ్చని ఐనా ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదని భారాస ఆరోపిస్తుంది. రాజకీయంగా తమపై ఉన్న కోపంతో రైతులు, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికి సూచించింది. రెండు ఆనకట్టల వద్ద పర్యటన తర్వాత అన్నారం వద్ద ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. గతంలో నీటిపారుదలశాఖ మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలు కడియం శ్రీహరి, హరీశ్‌రావు అక్కడే మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దశల వారీగా ప్రాజెక్టులోని మిగతా కాంపోనెంట్లను సందర్శిస్తామని భారాస నేతలు చెబుతున్నారు. పార్టీ నేతల ర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద ఏర్పాట్లను మాజీ MLA బాల్కసుమన్‌ పరిశీలించారు. 

Tags:    

Similar News