నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండలం గొల్లగూడెంకు చెందిన గంగమ్మ అనే వృద్దురాలు ఒక కోడిని పెంచుకుంటుంది. ఆ కోడి ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంటుంది. బయటకు వెళుతున్న క్రమంలో గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేశ్ ఇంట్లోని గడ్డివాము వద్ద గింజలు తినేది. గంగమ్మ కోడి తన ఇంట్లోని గడ్డివాములో గింజలు తింటుందనే ఆగ్రహంతో రాకేశ్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. దీంతో గొడవ మొదలైంది. తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేశ్ పై కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరున విలపిస్తూ నిన్న రాత్రి నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'ఇలాంటి గొడవలు సహజమే కదా. కేసు ఎందుకు? కోడికి రేటు ఎంతో చెప్పు. రాకేశ్తో డబ్బులు ఇప్పిస్తాం' అని పోలీసులు చెప్పారు. కానీ గంగమ్మ ససేమిరా అంటోంది. తనకు డబ్బులు వద్దని, తన కోడి కాళ్లు విరగొట్టిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని తెగేసి చెబుతోంది. అంతే కాదట. తన కోడికి జరిగినట్లు భవిష్యత్తులో మరో ఊరిలో మరో కోడికి జరగకూడదని పోలీసులతో వాదనకు దిగింది. ఆమెకు ఎలా సర్దిచెప్పాలో అర్థం కాని పోలీసులు చివరకు గ్రామానికి వచ్చి పరిష్కారం చేస్తామని, ప్రస్తుతానికి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి పంపించివేశారు. కానీ నిజానికి ఆ పంచాయితీ ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.