హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇటీవల నగరంలో జరిగిన రెండు ప్రధాన నేరాలను ప్రస్తావిస్తూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు జరిగాయని.. ఇది ప్రజల భద్రతకు ప్రమాదకరమని అన్నారు. పట్టపగలే ఓ ప్రముఖ నగల దుకాణంలో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడటం, అలాగే కూకట్‌పల్లిలో ఓ 12 ఏళ్ల బాలిక దారుణంగా హత్యకు గురికావడం వంటి ఘటనలు నగరంలో భద్రత లోపాలను స్పష్టం చేస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘తెలంగాణ పోలీసులను రాజకీయ ప్రతీకార చర్యలకు వాడుకోవడం వల్ల శాంతిభద్రతలపై దృష్టి పెట్టడం లేదు. పౌరులకు భయం కాదు, రక్షణ కావాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. పెరుగుతున్న నేరాల రేటు ప్రజల భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం మొత్తం శాంతిభద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.