Ramoji Rao: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం రేవంత్‌ ఆదేశాలు;

Update: 2024-06-08 03:00 GMT

 ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.

1936, నవంబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిననాటినుంచే విలక్షణ, సృజనాత్మకత కలిగిన ఆయన.. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974, ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడును ప్రారంభించారు. అనంతరం సితార సినీ పత్రిక, ఈటీవీ చానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫిల్మ్‌ సిటీని నిర్మించారు. బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు.

 ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు.

 

Tags:    

Similar News