Revanth Reddy: గోల్కొండ కోటపై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు.
ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. సుదీర్ఘ పోరాట ఫలితం. అనేక ప్రాణత్యాగాలు, అనేకానేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్య్రం. ఎందరో మహామహుల త్యాగాల వెల కట్టలేని బహుమతి ఈ స్వాతంత్య్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ…. యుద్ధం… హింస. కానీ, ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వాతంత్ర్య పోరాటం. అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్య్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి… ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మాగాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు, శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం. ఒక వైపు సవాలక్ష సమస్యలు. మరోవైపుదేశ విభజన గాయాలు. ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుంపట్లు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి… ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి… కార్యాచరణలు ప్రకటించి సగర్వంగా, సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్నా, అలసత్వం వహించినా, రాజనీతి లోపించినా, దూరదృష్టి కొరవడినా నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయి ఉండేది.