CM Revanth Reddy: : ప్లేస్కూళ్ల తరహాలో అంగన్‌వాడీలు
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు;
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్లేస్కూళ్ల తరహాలో అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే మూడో తరగతి వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలో విద్యాబోధనకు ఒక టీచర్‌ను నియమించాలని యోచిస్తున్నామన్నారు.
శుక్రవారం సచివాలయంలో విద్యావేత్తలు, విశ్రాంత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. విద్యారంగంపై, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై చర్చించారు.ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, జానయ్య, పద్మజా షా, విశ్వేశ్వరరావు, శాంతా సిన్హా, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘నేను, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి కచ్చితంగా బడ్జెట్ పెంచుతాం. 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలు చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించేందుకు యోచిస్తున్నాం. గురుకుల పాఠశాలలకు సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగిస్తాం. విద్య, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో కమిషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కార్పొరేట్ బడుల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాం.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాం. యూనివర్సిటీలకు వీసీలు, బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తాం. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాం. విద్యావేత్తలు ఇచ్చే సూచనలు స్వీకరిస్తాం. వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశాం. త్వరలోనే నియామకాలు పూర్తవుతాయి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.