revanth: నన్ను కోసినా పైసా రాదు
ఉద్యోగ సంఘాలపై రేవంత్ రెడ్డి అసహనం... ఎవరి మీద మీ సమరం అంటూ ప్రశ్నలు;
ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై మండిపడ్డారు. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా సమరం చేస్తారా? అని ప్రశ్నించారు. తనను కోసినా సరే.. వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. "సమరం అంటున్నారు.. ఎవరిమీద?. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలిస్తున్నారు. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా. సమరం కాదు.. సమయ స్పూర్తి కావాలి. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రండి.. చర్చిందాం. రాజకీయ నాయకుల్లో ఉద్యోగులు పావుగా మారొద్దు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు లేదా?" అని ప్రశ్నించారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని... బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని రేవంత్ అన్నారు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు.స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారమని ముఖ్యమంత్రి వెల్లడించారు.