రాష్ట్ర మంత్రివర్గంలో విభేదాలు తారాస్థాయికి చేరాయని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య విభేదాలు పీక్స్ కి చేరాయని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల మూలం గా కేబినెట్ రెండుగా చీలిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం, మంత్రుల మధ్య విభేదాల మూలంగా రాష్ట్రం దివాలా తీస్తోందని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రివర్గం అసంతృప్తిగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ ను కూడా పదే పదే రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. కేబినెట్లోకి కొత్తగా వచ్చే మంత్రులు సైతం తనకు వ్యతిరేకంగా ఉంటారని సీఎం భావిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణను అడ్డుకునేందుకు హైకమాండ్కు గందరగోళ నివేదికలను రేవంత్ పంపుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు 12శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే ఎక్కడ వారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారని సీఎంపై మండిపడ్డారు.