హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిఖ్ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూల్చేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ భవనం గతరాత్రి సడెన్ గా ఒక పక్కకు ఒరిగిన ఘటన అలజడి రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి 70 గజాల స్థలంలో జీ ప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మిచారు. ఫ్లోర్‌కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిల్డింగ్‌లో ఉన్న వాలంతా కిందకు వచ్చేశారు. మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈలోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనం పక్కనే ఉండే ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారిని హెచ్చరించారు. అయినా వారు వినలేదనీ.. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది పరిశీలించారు.